553 నిర్వాసిత కుటుంబాలకు ఇంటి స్థలాల పట్టాలు.. పునరావాసంలో మరో కీలక అడుగు…

కొడంగల్, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన లగచర్ల భూసేకరణ అంశంలో ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. టీజీఐఐసీ (TGIIC) ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు కోల్పోయిన లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల నిర్వాసిత కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటి స్థలాల పట్టాలను బుధవారం పంపిణీ చేశారు.
కొడంగల్‌లోని బసిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 553 కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించారు. అందులో 432 మందికి డ్రా (లాటరీ) ద్వారా, 121 మందికి నేరుగా ప్లాట్లు అందజేశారు. పూర్తి పారదర్శకత కోసం 77 రౌండ్ల డ్రా నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పారిశ్రామిక అభివృద్ధితో పాటు భూములు కోల్పోయిన రైతుల పునరావాసం, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయం జరిగేలా ఇంటి స్థలాల కేటాయింపు చేపట్టినట్లు తెలిపారు.
ఇప్పటికే ఇందిరమ్మ గృహ పథకం కింద 501 మంది లబ్ధిదారులకు పట్టాలు జారీ చేసినట్లు వెల్లడించారు. లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, రొట్టిబండ తండా రైతుల సహకారంతో 230 ఎకరాల్లో సమీకృత పాఠశాల విద్యా హబ్ ఏర్పాటు చేశామని, త్వరలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయని చెప్పారు. హైదరాబాద్–కొడంగల్ రేడియల్ రోడ్డు నిర్మాణంతో ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా, అదనపు కలెక్టర్ వెంకటాచారి, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, ఆర్డీవో అనిత, మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్, ఏఎంసీ చైర్మన్ అంపయ్య గౌడ్, సంబంధిత గ్రామాల సర్పంచులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

