జీతం ఒక్కటే కాదు.. కెరీర్, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కే యువత తొలి ఓటు…
హైదరాబాద్, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి):
నేటి యువతకు ఉద్యోగం అంటే కేవలం భారీ జీతం మాత్రమే కాదు.. మంచి కెరీర్, నేర్చుకునే అవకాశాలు, పని-వ్యక్తిగత జీవిత సమతుల్యత కూడా అంతే ముఖ్యం. ఈ మారిన ఆలోచనకే అద్దం పడుతూ ర్యాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (REBR)-2026 నివేదికలో గూగుల్ భారత్‌లో అత్యంత ఆకర్షణీయ ఎంప్లాయర్‌గా నిలిచింది. టాటా గ్రూప్ రెండో, అమెజాన్ మూడో స్థానంలో నిలవగా, శాంసంగ్ ఇండియా, డెల్ టెక్నాలజీస్ తదితర సంస్థలు టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.
34 దేశాల్లో 1.75 లక్షల మందికి పైగా ఉద్యోగులు, ఉద్యోగార్థుల అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించగా, భారత్‌లో సుమారు 3,500 మంది పాల్గొన్నారు. ఉద్యోగం ఎంపికలో ఇప్పుడు యువత సంస్థ సంస్కృతి, అభివృద్ధి అవకాశాలు, ఉద్యోగ భద్రత, పారదర్శకత, ఉద్యోగి సంక్షేమాన్ని ప్రధానంగా పరిగణిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
సర్వే ప్రకారం 49 శాతం మంది వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం, 42 శాతం మంది కెరీర్లో ఎదుగుదలకు అవకాశాలు లేకపోవడం, 41 శాతం మంది తక్కువ వేతనం కారణంగా ఉద్యోగం మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా డిజిటల్ రంగ ఉద్యోగులు అధిక వేతనంతో పాటు వేగంగా ఎదిగే అవకాశాల కోసం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది.
ఉద్యోగులను నిలబెట్టుకోవాలంటే కేవలం జీతం పెంచడం సరిపోదని, మంచి కార్యాలయ వాతావరణం, నైపుణ్యాభివృద్ధికి అవకాశాలు, ఉద్యోగులతో నమ్మకమైన సంబంధాలు, సమతుల్యమైన పని సంస్కృతి కల్పించే సంస్థలకే భవిష్యత్తులో యువత తొలి ప్రాధాన్యం ఉంటుందని ర్యాండ్‌స్టాడ్ ఇండియా పేర్కొంది.

