📄 ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రామాయంపేట వై జంక్షన్‌కు గ్రీన్ సిగ్నల్..!

రామాయంపేట వై జంక్షన్‌కు గ్రీన్ సిగ్నల్..!

రూ.47.35 కోట్లతో ఫ్లైఓవర్‌కు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం.. ఎంపీ రఘునందన్‌రావు కృషికి ఫలితం

రామాయంపేట, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి): రామాయంపేట పట్టణంలోని జాతీయ రహదారి-44పై ప్రమాదాలకు కేరాఫ్‌గా మారిన వై జంక్షన్‌కు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. వై జంక్షన్ వద్ద 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.47.35 కోట్ల అంచనా వ్యయానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారిక ఆమోదం తెలిపింది. ఈ మేరకు జూలై 31న హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు ఈ సమస్యను కేంద్ర రోడ్డు రవాణా శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లి నిరంతరం అనుసరించడంతో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. గత కొన్నేళ్లుగా ఈ జంక్షన్ వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రజలు, వాహనదారులు ఫ్లైఓవర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

ఎన్‌హెచ్‌ఏఐ ఉత్తర్వుల ప్రకారం రామాయంపేట బైపాస్ చివర ఆదిగాస్/ఆధ్య హోటల్ సమీపంలోని బ్లాక్‌స్పాట్ వద్ద 13×30×5.5 మీటర్ల పరిమాణంలో 6 లేన్ల వాహన వంతెన (వీయూపీ) నిర్మించనున్నారు. టెండర్ల ద్వారా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించగా, త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫ్లైఓవర్ పూర్తయితే ప్రమాదాలు తగ్గడంతో పాటు హైదరాబాద్–నాగ్‌పూర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలకు కూడా గణనీయమైన ఉపశమనం లభించనుంది.

ఈ సందర్భంగా ఫ్లైఓవర్‌కు నిధులు మంజూరు కావడంపై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు మాట్లాడుతూ, రామాయంపేట ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డిమాండ్ నెరవేరడం సంతోషకరమన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఎంపీ రఘునందన్‌రావు నిరంతరం చేసిన కృషికే ఈ ఆమోదం దక్కిందని కొనియాడారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమై ప్రజలకు అందుబాటులోకి వస్తే ప్రమాదాలు తగ్గడంతో పాటు రామాయంపేట అభివృద్ధికి ఈ ఫ్లైఓవర్ మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఎంపీ రఘునందన్‌రావుకు బీజేపీ నాయకులు, స్థానిక ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!