మిగతా 8 మంది ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలి
మనోహరాబాద్, 18 సెప్టెంబర్ (నవజ్యోతి ప్రతినిధి నవీన్): బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని బీఆర్‌ఎస్ నాయకుడు నాయిని ఉదయ్ రంజన్ గౌడ్ అన్నారు.
పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలపై అనర్హత వేటు తప్పదనే విషయం ఈ తీర్పుతో స్పష్టమైందన్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీ చేసిన విషయం స్పష్టంగా ఉన్నప్పటికీ, ఆయన పార్టీ మారలేదంటూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తీర్పుతో రుజువైందన్నారు.
ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించిన నాయిని ఉదయ్ రంజన్ గౌడ్.. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన మిగతా 8 మంది ఎమ్మెల్యేలపై కూడా వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ మరోసారి నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు.

