రూ.2.18 లక్షలకు దంతేపల్లి సర్పంచ్ బాలరాజుకు దక్కిన ఇసుక.
రామాయంపేట,ఆగస్టు 5 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) :
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో గత జూలై నెలలో రెవెన్యూ అధికారులు అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మైనింగ్ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బుధవారం రామాయంపేట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆ ఇసుక డంపులను బహిరంగ వేలం వేశారు.
వేలం ప్రక్రియలో మొత్తం తొమ్మిది మంది పాల్గొనగా, రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామ సర్పంచ్ బాలరాజు అత్యధికంగా రూ.2,18,000కు వేలం పాట పాడి ఇసుక డంపులను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను స్వాధీనం చేసుకుని నిబంధనల ప్రకారం బహిరంగ వేలం నిర్వహించినట్లు తెలిపారు. మండలంలో ఎక్కడైనా అక్రమ ఇసుక నిల్వలు లేదా రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే రెవెన్యూ శాఖకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
వేలంలో దక్కించుకున్న ఇసుకకు సంబంధించి పూర్తి మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు చెల్లించిన అనంతరమే ఇసుకను స్వాధీనం చేసుకోవాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వినియోగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్,రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోపి,గౌస్ తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

