మౌలిక వసతులు లేక ప్రజల అవస్థలు..
250 కుటుంబాలకు కనీస సౌకర్యాలు కల్పించాలి
ప్రజావాణిలో అధికారులకు బీజేపీ కౌన్సిలర్ శంకర్‌గౌడ్ వినతి
రామాయంపేట, సెప్టెంబర్ 7 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్):
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కె.సి.ఆర్. కాలనీలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని 8వ వార్డు బీజేపీ కౌన్సిలర్ జంగంపల్లి శంకర్‌గౌడ్ కోరారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత అధికారులకు కాలనీ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా శంకర్‌గౌడ్ మాట్లాడుతూ.. కె.సి.ఆర్. కాలనీలో సుమారు 250 పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన దాదాపు 1,000 మంది నివసిస్తున్నారని తెలిపారు. కాలనీకి ప్రత్యేక వార్డు లేకపోవడంతో ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పలుచోట్ల డ్రైనేజీలు దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అవసరమైన చోట నూతన డ్రైనేజీలు నిర్మించడంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని కోరారు.
కాలనీలో పిచ్చిమొక్కలు, గడ్డి విపరీతంగా పెరగడంతో విషపూరిత పాములు ఇళ్లలోకి చొరబడుతున్నాయని, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. వెంటనే పిచ్చిమొక్కలు తొలగించి, దోమల నివారణకు క్రమం తప్పకుండా మందులు పిచికారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వీధిలైట్లను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతిరోజూ చెత్త సేకరణకు చెత్త బండి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాలనీ ప్రధాన రహదారి వద్ద ప్రజల సౌకర్యార్థం రిక్వెస్ట్ బస్‌స్టాప్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.
ప్రజల ఆరోగ్యం, భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని కె.సి.ఆర్. కాలనీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని శంకర్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.

