FFS యాప్ లో సాంకేతిక సమస్యలపై రైతుల సందేహాల నివృత్తి
సన్న వరి రకాలపై రైతులకు అవగాహన : జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్
డిజిటల్ క్రాప్ సర్వేలో రైతులు తప్పనిసరిగా పాల్గొనాలి
పంట వివరాల ఆధారంగానే కొనుగోళ్లు: వ్యవసాయ శాఖ
రామాయంపేట,ఆగస్టు 25 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్):
రామాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ ఆధ్వర్యంలో రైతులకు FFS (ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్) యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యాప్ వినియోగం, సాంకేతిక సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అవగాహన కల్పించి, వారి సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.ప్రభుత్వం ప్రకటించిన సన్న వరి బోనస్‌కు అర్హత కలిగిన ఏడు సన్న వరి రకాలపై రైతులకు వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన సన్న వరి రకాలకు చెందిన విత్తనాలను ఏ డీలర్ వద్ద కొనుగోలు చేసినా, రైతులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
డిజిటల్ క్రాప్ సర్వేపై సూచనలు:
ప్రతి గ్రామంలో ఒక ప్రైవేట్ వాలంటీర్‌ను నియమించి డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాలంటీర్లు పంట పొలాల సర్వేకు వచ్చినప్పుడు రైతులు స్వయంగా పొలాల వద్ద ఉండి పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలని సూచించారు. డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదయ్యే పంట వివరాల ఆధారంగానే భవిష్యత్తులో పంటల కొనుగోలు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్, ఏఈఓలు ప్రవీణ్, సాయికృష్ణతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

