96 ఉల్లంఘనలు.. రాంగ్‌రూట్‌లో వెళ్తూ చివరకు చిక్కిన వాహనదారుడు…
హర్యానా, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి): ట్రాఫిక్ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తే ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఘటన స్పష్టం చేసింది. సుమారు రూ.50 వేల విలువ చేసే 2017 మోడల్ యాక్టివాపై ఏకంగా రూ.10 లక్షల విలువైన 96 ట్రాఫిక్ ఛలాన్లు పేరుకుపోవడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. రాంగ్‌రూట్‌లో వెళ్తూ పట్టుబడిన వాహనదారుడి స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గురుగ్రామ్‌లోని రాజీవ్ చౌక్ సమీపంలో సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రశాంత్ అనే వ్యక్తి రాంగ్‌రూట్‌లో యాక్టివాపై వస్తూ పోలీసులకు చిక్కాడు. వాహన పత్రాలు, ఇన్సూరెన్స్, పీయూసీ సర్టిఫికెట్ అడగగా అతడి వద్ద ఏవీ లేకపోవడంతో పోలీసులు ఆన్‌లైన్‌లో వాహనం వివరాలు పరిశీలించారు. ఈ క్రమంలో ఆ స్కూటీపై 96 పెండింగ్ ఛలాన్లు, దాదాపు రూ.10 లక్షల జరిమానా ఉన్నట్లు తేలింది. వాహనం అతడి సోదరి పేరుతో నమోదై ఉన్నట్లు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం నమోదైన 96 ఛలాన్లలో 95 ఆటోమేటిక్ ట్రాఫిక్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా నమోదైనవే. హెల్మెట్ ధరించకపోవడం, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడపడం, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ లేకపోవడం వంటి ఉల్లంఘనలే ఎక్కువగా ఉన్నాయి. ఒక్కసారి మాత్రమే ప్రత్యక్ష తనిఖీలో ఛలాన్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటన అనంతరం స్కూటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పెండింగ్ ఛలాన్లను నిర్లక్ష్యం చేయొద్దని వాహనదారులకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు సీసీటీవీ కెమెరాల ద్వారా నమోదయ్యే ఈ-ఛలాన్లను సకాలంలో చెల్లించాలని హెచ్చరించారు.
తెలంగాణలోనూ ఇలాంటి ఘటన
గతంలో తెలంగాణలోని కరీంనగర్‌లో నిర్వహించిన తనిఖీల్లో ఒక ద్విచక్ర వాహనంపై 277 ట్రాఫిక్ ఛలాన్లు, దాదాపు రూ.79,845 జరిమానా పెండింగ్‌లో ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు మరోసారి స్పష్టం చేస్తున్నారు.

