రెండు నెలల్లో 90 వేల లీటర్ల నాటుసారా ఊట ధ్వంసం..
హైదరాబాద్, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో అక్రమ నాటుసారా తయారీపై ఎక్సైజ్ శాఖ భారీ స్థాయిలో దాడులు కొనసాగిస్తోంది. గత రెండు నెలల్లో 90,740 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడంతో పాటు 6,074 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుంది. నాటుసారా తయారీలో వినియోగించే 30,329 కిలోల బెల్లాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాష్ మొహంతి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన అక్రమ మద్యం తయారీని పూర్తిగా అరికట్టే వరకు దాడులు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో అక్రమ సారా తయారీ ఎక్కువగా జరుగుతుండగా, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోనూ కొన్ని కేసులు వెలుగుచూశాయి. ఈ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టి తయారీ కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర టాస్క్ఫోర్స్, జిల్లా టాస్క్ఫోర్స్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సమన్వయంతో దాడులు నిర్వహిస్తున్నాయి. నాటుసారాతో పాటు డ్యూటీ చెల్లించని మద్యం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపైనా చర్యలు కొనసాగుతున్నాయి.
కొణార్క్ ఎక్స్ప్రెస్తో పాటు ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర నుంచి వచ్చే రైళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వరుస దాడులతో అక్రమ సారా తయారీదారులు, స్మగ్లర్లలో భయాందోళన నెలకొన్నట్లు పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి ప్రత్యేక ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.

