ఓయూ దూరవిద్య కోర్సులకు ప్రవేశాలు ప్రారంభం..
హైదరాబాద్, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి): ఉద్యోగులు, గృహిణులు, ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే వారికి ఉస్మానియా విశ్వవిద్యాలయం శుభవార్త తెలిపింది. ప్రొఫెసర్ జి. రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (PGRRCDE) ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.
ఆగస్టు 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, సెప్టెంబర్ 11 వరకు అవకాశం ఉంటుంది. యూజీసీ–డీఈబీ మార్గదర్శకాల ప్రకారం ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) విధానంలో అడ్మిషన్లు నిర్వహించనున్నారు.
ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్), బీఏ, బీకాం, బీబీఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, వేద జ్యోతిష్యంలో అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లొమా, యోగా సర్టిఫికెట్ కోర్సుతో పాటు పలు సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సుల వారీగా అర్హతలు వేర్వేరుగా ఉంటాయి.
అక్టోబర్ 15 నుంచి ఆన్‌లైన్ కాంటాక్ట్ తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. కోర్సుల అర్హతలు, ఫీజులు, సిలబస్, బోధనా మాధ్యమం తదితర పూర్తి వివరాలను పీజీఆర్‌ఆర్‌సీడీఈ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు.

