📄 ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అవినీతిపై బ్రిక్స్ ఉమ్మడి పోరు..!

అవినీతిపై బ్రిక్స్ ఉమ్మడి పోరు..!

హైదరాబాద్ వేదికగా కీలక నిర్ణయాలు.. పరారీలో ఉన్న అవినీతి నిందితులపై ప్రత్యేక నెట్‌వర్క్‌కు ఆమోదం…

హైదరాబాద్, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి): భారత్ అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన బ్రిక్స్ (BRICS) అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం కీలక నిర్ణయాలకు వేదికైంది. సరిహద్దులు దాటి జరిగే అవినీతి, పరారీలో ఉన్న నిందితులను గుర్తించడం, అక్రమ ఆస్తుల స్వాధీనం, అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.

భారత ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశాల్లో బ్రిక్స్ దేశాల విధాన నిర్ణేతలు, అవినీతి నిరోధక నిపుణులు, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, చట్ట అమలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. “బిల్డింగ్ ఫర్ రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ” అనే అంశంతో సమావేశాలు జరిగాయి.

సమావేశాన్ని ప్రారంభించిన డీఓపీటీ కార్యదర్శి రచనా షా అవినీతిపై భారత్‌కు ‘జీరో టాలరెన్స్’ విధానమని స్పష్టం చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం, సాంకేతిక ఆధారిత పాలన ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో పరారీలో ఉన్న అవినీతి నిందితులను గుర్తించి అప్పగింత (ఎక్స్‌ట్రడిషన్) ప్రక్రియను వేగవంతం చేసేందుకు బ్రిక్స్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాక్టీషనర్స్ నెట్‌వర్క్ ఏర్పాటు ప్రతిపాదనకు సభ్య దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. అలాగే అక్రమ ఆస్తుల గుర్తింపు, స్వాధీనం కోసం సమాచార మార్పిడిని వేగవంతం చేసే ఉమ్మడి విధానాలపై కూడా ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

అవినీతి నిరోధంలో కృత్రిమ మేధ (AI), మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, డిజిటల్ గవర్నెన్స్ వినియోగంపై ప్రత్యేకంగా చర్చించారు. ఫిన్‌టెక్, వర్చువల్ డిజిటల్ అసెట్స్ (క్రిప్టో వంటి వ్యవస్థలు) ద్వారా జరిగే మనీలాండరింగ్‌ను అరికట్టేందుకు కఠిన నియంత్రణలు, దేశాల మధ్య సమన్వయం పెంచాలని సభ్య దేశాలు నిర్ణయించాయి.

హైదరాబాద్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో బ్రిక్స్ దేశాల మధ్య అవినీతి నిరోధక చర్యలు, అక్రమ ఆస్తుల స్వాధీనం, పరారీలో ఉన్న నిందితుల గుర్తింపు వంటి అంశాల్లో మరింత సమర్థవంతమైన సహకారానికి బాటలు వేస్తాయని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!