రామాయంపేట జూలై 4 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) : రామాయంపేట ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా సాగిన 333 రోజుల నిరాహార దీక్షలు, ప్రజా ఉద్యమాల ఫలితంగా ప్రకటించిన రెవిన్యూ డివిజన్ ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలుకాకపోవడం అత్యంత విచారకరమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు పేర్కొన్నారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రామాయంపేట రెవిన్యూ డివిజన్‌కు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిందని, అయితే రెండున్నర సంవత్సరాలు గడిచినా ఆ హామీ అమలుకాకపోవడం ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆయన అన్నారు.రామాయంపేట రెవిన్యూ డివిజన్ అమలు కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు వినతిపత్రాలు అందజేయడంతో పాటు సంబంధిత అధికారులతో చర్చలు జరిపినట్లు చెప్పారు. అలాగే మెదక్ ఎంపీ రఘునందన్ రావు డీడీఆర్‌సీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించి, రెవిన్యూ డివిజన్ అమలులో జాప్యంపై కలెక్టర్‌ను ప్రశ్నించి, వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.2009 వరకు నియోజకవర్గంగా గుర్తింపు పొందిన రామాయంపేట నేడు కనీసం రెవిన్యూ డివిజన్ కూడా పూర్తిస్థాయిలో పొందలేకపోవడం ఆ ప్రాంతంపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. గెజిట్ నోటిఫికేషన్ సకాలంలో జారీ చేసి ఉంటే ప్రజలు నేడు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే తొలి తీర్మానం రెవిన్యూ డివిజన్ అమలుపై, రెండో తీర్మానం రామాయంపేట నియోజకవర్గ పునరుద్ధరణపై చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే అధికారంలో ఉన్నవారు ఈ అంశంపై చొరవ చూపకపోవడం ప్రజలను నిరాశకు గురిచేసిందన్నారు.ప్రస్తుతం డీలిమిటేషన్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రామాయంపేటకు తిరిగి నియోజకవర్గ హోదా సాధించేందుకు ఇదే కీలక సమయమని పేర్కొన్నారు. అందుకు ముందు రెవిన్యూ డివిజన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయించడం అత్యవసరమని స్పష్టం చేశారు.రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, యువత మరియు రామాయంపేట అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు వచ్చి రెవిన్యూ డివిజన్ సాధనతో పాటు నియోజకవర్గ పునరుద్ధరణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.రామాయంపేట ప్రజల ఆత్మగౌరవం, అభివృద్ధి, భవిష్యత్తు కోసం న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

