📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper

కామారెడ్డిలో ఆచూకీ.. రామాయంపేటకు క్షేమంగా తరలింపు

పిల్లలపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలి: సీఐ సైదానాయక్.

రామాయంపేట,ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) :

 

రామాయంపేట పట్టణంలోని కేసీఆర్ కాలనీకి చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైన ఘటనలో పోలీసులు చేపట్టిన ప్రత్యేక గాలింపు చర్యలతో వారి ఆచూకీ కామారెడ్డిలో లభించింది. విద్యార్థులను పోలీసులు సురక్షితంగా రామాయంపేటకు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

విద్యార్థుల అదృశ్యంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలించగా కామారెడ్డిలో వారి జాడ గుర్తించారు. అనంతరం రామాయంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. సైదానాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులను సురక్షితంగా రామాయంపేటకు తరలించారు.

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక చొరవ

విద్యార్థుల అదృశ్య ఘటనపై మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడినట్లు సమాచారం. విద్యార్థులను క్షేమంగా గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు. పోలీసులు వేగంగా స్పందించి విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రోహిత్ రావు, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం: సీఐ : బి సైదానాయక్ 

ఈ సందర్భంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. సైదానాయక్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. పాఠశాల ముగిసిన తర్వాత పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు తెలుసుకోవాలని అన్నారు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పిల్లలు ఎక్కడైనా కనిపించకుండా పోయిన సందర్భంలో ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ సూచించారు. విద్యార్థుల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఈ సందర్భంగా రామాయంపేట సీఐ బి. సైదానాయక్, ఎస్‌ఐ బలరాజ్, ఏఎస్‌ఐ రవీందర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. విద్యార్థుల ఆచూకీ కోసం కృషి చేసిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!