ప్రేమ పెళ్లి.. అదే రోజు డబ్బుల డిమాండ్.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆడియో…
నూజివీడు, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి):
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని 24 గంటలు గడవకముందే ఆమె తల్లిదండ్రులకు అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి ఆడియో రికార్డింగ్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన రాజేశ్వరిని కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన మధు ప్రేమించాడు. స్నేహితుల సమక్షంలో వీరవల్లి పోలీస్స్టేషన్లో రాజేశ్వరిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
అయితే పెళ్లయిన రోజే రాజేశ్వరి తల్లికి మధు ఫోన్ చేసి.. మీ కూతురిని మీకు అప్పగించాలంటే రూ.12 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వైరల్ అవుతున్న ఆడియోలో ఉంది. తమపై ఎలాంటి కేసులు పెట్టకూడదని షరతు విధించినట్లు కూడా సంభాషణలో వినిపిస్తోంది. షరతులకు అంగీకరిస్తే యువతిని ఇంటి వద్దకు తీసుకొచ్చి అప్పగిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో రాజేశ్వరి కుటుంబసభ్యులు రూ.6 లక్షలు చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రేమ వివాహం జరిగిన 24 గంటల్లోనే యువతిని అప్పగించేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్లు ఉన్న ఆడియో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.
అయితే వైరల్ అవుతున్న ఆడియోలోని సంభాషణ నిజానిజాలు, డబ్బుల డిమాండ్ వెనుక అసలు వ్యవహారం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

