- ప్రతి గ్రామంలో ఓటరు జాబితాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్ నాయకులకు గంప గోవర్ధన్ సూచన…
రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై భిక్కనూర్ మండల బీఆర్‌ఎస్ నాయకులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాల పరిశీలన, గ్రామాల వారీగా చేపట్టాల్సిన చర్యలు, ప్రజలకు అవగాహన కల్పించడం, పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం డూప్లికేట్, అనర్హ ఓట్లను మాత్రమే తొలగించాలని, అర్హులైన ఓటర్ల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని కోరారు. ప్రతి గ్రామంలో ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకునేలా పార్టీ నాయకులు అవగాహన కల్పించాలని సూచించారు.
అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని గోవర్ధన్ నాయకులకు సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హ ఓటరి హక్కు పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి అత్తేల్లి శ్రీనివాస్ , మాజీ సర్పంచ్ తునికి వేణు, పెద్దమల్లారెడ్డి సర్పంచ్ సాయ గౌడ్, రామేశ్వర్‌పల్లి సింగిల్ విండో చైర్మన్ భూమ్ రెడ్డి, రామచంద్రం, హనుమంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితర బీఆర్‌ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అండగా నిలవాలని సమావేశంలో నిర్ణయించారు.

