-
బీజేపీ కౌన్సిలర్ల తీరుపై మండిపడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ !
-
శానిటరీ ఇన్‌స్పెక్టర్ నియామకానికీ మరో వినతి
కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్‌ను బీజేపీ కౌన్సిలర్లు పార్టీ కార్యాలయంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజల అభివృద్ధి పనులను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ సహచర కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ గిరికి వినతిపత్రం అందజేశారు. ఇదే సందర్భంగా మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టును వెంటనే భర్తీ చేయాలని కోరుతూ మరో వినతిపత్రాన్ని కూడా సమర్పించారు.
ఈ సందర్భంగా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, పట్టణ ప్రజల అభివృద్ధి కోసం పాలకపక్షం తీసుకొస్తున్న ప్రతి ఎజెండాను బీజేపీ కౌన్సిలర్లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి కౌన్సిల్ సమావేశంలో ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించి సభను సజావుగా సాగనివ్వకుండా అడ్డుకుంటున్నారని, అనంతరం బయటకు వచ్చి పాలకపక్షంపైనే విమర్శలు చేస్తున్నారని అన్నారు.
ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు వంటి అభివృద్ధి పనులను కూడా అడ్డుకుంటూ, తమకు నచ్చిన పనులకే ఆమోదం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి తమకు అనుకూలమైన పనులకే ఆమోదం పొందాలని చూస్తున్నారని, కమిషన్ల రాజకీయాలు చేస్తూ కౌన్సిల్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కామారెడ్డి పట్టణ అభివృద్ధికి ఇప్పటి వరకు ఒక్క రూపాయి ప్రత్యేక నిధులు కూడా తీసుకురాలేదని, మున్సిపల్ అధికారులపై అవినీతి ముద్ర వేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం బీజేపీ పార్టీ కార్యాలయం కాదని, చిల్లర రాజకీయాలు మానుకుని పట్టణ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గం చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటే సహించేది లేదని, అవసరమైతే ప్రజాక్షేత్రంలోనే తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు.
అనంతరం మున్సిపాలిటీలో రెగ్యులర్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ లేకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, సిబ్బంది పర్యవేక్షణ, ప్రజారోగ్య కార్యక్రమాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఖాళీగా ఉన్న శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టును వెంటనే భర్తీ చేసి పారిశుద్ధ్య వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.
వినతిపత్రాల సమర్పణ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు షేరు, అంజాద్, వాజిద్, సుల్తానా, లలిత, కళ్లే సావిత్రి, తహసున్నిసా, అఫ్రీన్ సుల్తానా, మహేష్, బబ్లు, జావీద్, గంగాధర్, అఖిలతో పాటు కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

