📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeతెలంగాణనల్గోండఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి - పోగుల సైదులు గౌడ్

ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి – పోగుల సైదులు గౌడ్

మిర్యాలగూడ, జూలై 25 (నవజ్యోతి ప్రతినిధి) హుజూర్‌నగర్ నియోజకవర్గం, చింతలపాలెం మండలం, చింత్రియాల గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనను తెలంగాణ తెలుగు దేశం పార్టీ నాయకులు పోగుల సైదులు గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో విగ్రహం బొటనవేలు విరిగిపోవడం బాధాకరమని పేర్కొంటూ తన విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను పోలీసులు వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విగ్రహాలకు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం జరుగుతుండటం వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన పాలకులు, రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, తర్వాత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచే ఎదిగారని గుర్తు చేశారు. ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు తెలుగుదేశం పార్టీని సమైక్యవాదిగా చిత్రీకరించడం రాజకీయ లబ్ధి కోసమేనని ఆరోపించారు. అధికార పార్టీలోని కొందరు నాయకులు అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై విమర్శలు చేయడం తగదని, రాజకీయ నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హేయమైన చర్యలకు పాల్పడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణలో పటేల్–పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, పేదలు, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. చివరగా, ఎన్టీఆర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేస్తూ, ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టప్రకారం కఠిన శిక్షలు విధించాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!