– జిల్లా అధ్యక్షుడు యాదగిరిని అభినందించిన రాష్ట్ర అధ్యక్షుడు
– నియోజకవర్గం కమిటీల ఏర్పాటుపై హర్షం
– త్వరలో ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డు
సంగారెడ్డి, ఆగష్టు 13 (నవజ్యోతి ప్రతినిది) :
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ( టీయూడబ్ల్యుజే- ఐజేయు) ద్వారానే జర్నలిస్టుల కు భద్రత సాధ్యమని రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తో ఇప్పటికే అనేక దఫాలుగా చర్చలు జరిగాయని, త్వరలో హెల్త్ కార్డు లు వస్తాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా నూతన కమిటీ, పటాన్ చేరు నియోజకవర్గం నూతన కమిటీలు జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాదులోని రాష్ట్ర యూనియన్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ ని మర్యాద పూర్వకంగా కలిశారు. గజమాలతో , శాలువా తో సత్కరించారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా మహాసభను క్రమశిక్షణతో భారీ ఎత్తున నిర్వహించినందుకు జిల్లా కమిటీని అభినందించారు. రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు బండారు యాదగిరికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గ కమిటీ ఏర్పాటుపై హర్షం వెలిబుచ్చారు. టి యు డబ్ల్యూ జె-ఐ జే యు మొక్కుబడి యూనియన్ కాదు అని, 70 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సంఘం అని పేర్కొన్నారు. జర్నలిస్టుల కోసం నిరంతరం పనిచేస్తున్న ఏకైక సంఘం అని చెప్పారు. అక్రిడేషన్ కార్డులు ఇప్పటికే చాలా మందికి వచ్చాయని, మిగిలిన వారికి కూడా త్వరలో వస్తాయని చెప్పారు.అంతే కాకుండా అర్హులైన వారికి ఇంటి స్థలాలకు సంబంధించి త్వరలో ప్రభుత్వం ఒక పాలసీని తెస్తుందని తద్వారా అందరికీ ఇట్టి స్థలాలు వస్తాయని వివరించారు. పాత్రికేయులలో వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ జిల్లా మహాసభను అందరి సహకారంతో నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి ఒక్క రిపోర్టర్ కూడా తమ సొంత ఫంక్షన్ లాగా భావించి జిల్లా మహాసభకు తరలివచ్చారని పేర్కొన్నారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టుల సంక్షేమానికి పకడ్బందీ ప్రణాళికతో పనిచేస్తామని చెప్పారు. పటాన్చెరు మాదిరిగానే జిల్లాలో ని మిగతా ప్రాంతాల్లో కూడా త్వరలో కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల ఐక్యతను సాధించడం ద్వారా హక్కులను పొందడమే తమ ముందున్న కర్తవ్యం అని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైసల్ సూచనలు సలహాలతో జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేస్తున్నామని వివరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ సంఘం తలపెట్టిన కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని సూచించారు. సమన్వయం చేసుకోవడం ద్వారా సంఘం కార్యక్రమాలకు ఎక్కువ మంది హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర నాయకుడు బాసిత్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రతి విషయంలో టియుడబ్ల్యూజేఐజేయు అండగా నిలిచిందని అన్నారు. సంఘం పిలుపును పూచే తప్పకుండా పాటిస్తామని చెప్పారు. జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలను సమిష్టిగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి బసవేశ్వర్ మాట్లాడుతూ యూనియన్ కార్యక్రమాల వల్ల ప్రతి జర్నలిస్టుకు ఉత్సాహం కలుగుతోందని చెప్పారు. చిన్న మధ్య తరహా పత్రికల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చౌహాన్ మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టు కూడా పోరాట పటిమ ను సాధించాలంటే టీయూడబ్ల్యూజేఐజేయు చరిత్ర తెలుసుకుంటే సరిపోతుందన్నారు. అందరి సంక్షేమమే లక్ష్యంగా టియుడబ్ల్యూజే పని చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గం అధ్యక్షుడు పత్తి నరసింహ మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టు గర్వపడే విధంగా పటాన్చెరు నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు. ఈ సందర్భంగా పాలువురు జర్నలిస్టులు జిల్లా అధ్యక్షుడు యాదగిరికి పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ విల్సన్, జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు భూపాల్ రెడ్డి, హిమాయత్, పటాన్చెరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యాదగిరి, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.

