ఉద్యోగాలు పోయేలా చేస్తామని బెదిరింపులు.. ప్రతికూల వార్తల పేరుతో డబ్బులు డిమాండ్
కామారెడ్డి, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):
ఆర్టీఐ, ప్రెస్ పేర్లను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ఇతరులను
బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న కేసులో ఇద్దరిని కామారెడ్డి పోలీసులు
అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు పోయేలా చేస్తామని, ప్రతికూల వార్తలు ప్రచురిస్తామని
బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న
కేసులోనూ నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
కామారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్ క్రైం నం. 693/2024లో చేపూరి శిరీష
ఆత్మహత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని డీఎస్పీ మధుసూదన్ తెలిపారు.
ఈ కేసులో A2 ఇందూరి సిద్ధా గౌడ్, A3 లాండే భాస్కర్‌లను గురువారం
అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు.
ఆర్టీఐ ద్వారా ఉద్యోగులు, ఇతరుల ఉద్యోగ సంబంధిత వివరాలు సేకరించి.. వాటిని ఆధారంగా
చేసుకుని ఉద్యోగం పోయేలా చేస్తామని బెదిరించినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
నిందితులు తమను ప్రెస్ రిపోర్టర్లుగా పరిచయం చేసుకుని ప్రతికూల కథనాలు ప్రచురిస్తామని,
అధికారులకు ఫిర్యాదులు చేస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదే తరహా వ్యవహారాలపై కామారెడ్డి, యల్లారెడ్డి, దోమకొండ, గాంధారి,
దేవునిపల్లి పోలీస్‌స్టేషన్లలో గతంలోనూ కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
ఆర్టీఐ చట్టం ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ప్రజలకు కల్పించిన హక్కు.
ప్రెస్ కూడా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పాలనను ప్రశ్నించాల్సిన బాధ్యత కలిగిన
వ్యవస్థ. అయితే ఆర్టీఐ, ప్రెస్ పేర్లను వ్యక్తిగత కక్షలు, రాజకీయ కక్షలు, బెదిరింపులు,
వసూళ్లకు అస్త్రాలుగా ఉపయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
ప్రజాప్రయోజనాల కోసం వినియోగించాల్సిన సమాచార హక్కును వ్యక్తిగత ప్రయోజనాలు,
బెదిరింపులు, వసూళ్ల కోసం దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన అవసరం ఉంది.
అభివృద్ధి పనులను అడ్డుకోవడం, ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహించకుండా ఒత్తిడి తీసుకురావడం,
వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం కోసం ఆర్టీఐని దుర్వినియోగం చేయకుండా.. ప్రజాప్రయోజనాల కోసం
మాత్రమే వినియోగించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో ఆర్టీఐ, ప్రెస్ పేర్లను పదేపదే
దుర్వినియోగం చేస్తూ బెదిరింపులు, వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా
ప్రత్యేక నిబంధనలు తీసుకురావాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.
ఇలాంటి దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు
సంబంధిత వ్యవస్థల నుంచి అధికారికంగా అనర్హులుగా ప్రకటించే విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన
అవసరం ఉంది. అయితే నిజమైన ఆర్టీఐ కార్యకర్తలు, జర్నలిస్టుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా
ఈ చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది.
ప్రెస్ పేరు చెప్పుకుని బెదిరింపులు, వసూళ్లకు పాల్పడేవారి వల్ల నిజాయితీగా పనిచేసే
జర్నలిస్టుల విశ్వసనీయత దెబ్బతింటుంది. అలాగే ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే
సమాచార హక్కు ఉద్దేశమే దెబ్బతినే ప్రమాదం ఉంది.
ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన ఆర్టీఐ, ప్రెస్ వంటి వ్యవస్థలను వ్యక్తిగత,
రాజకీయ ప్రయోజనాలకు వాడకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ మధుసూదన్, సీఐ నరహరి తెలిపారు.

