–జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం
–నారాయణఖేడ్‌లో టీయూడబ్ల్యూజే–ఐజేయూ సర్వసభ్య సమావేశం
నారాయణఖేడ్, సెప్టెంబర్ 6 (నవజ్యోతి ప్రతినిధి):
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయి నుంచి గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని టీయూడబ్ల్యూజే–ఐజేయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన యూనియన్ సర్వసభ్య సమావేశంలో జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలు, సంఘం బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ మారుతున్న పరిస్థితుల్లో జర్నలిస్టులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ, మండల స్థాయిలో పనిచేసే జర్నలిస్టుల సమస్యలను ప్రత్యేకంగా నమోదు చేసి జిల్లా కమిటీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ అందేలా చూడడంతో పాటు ఇంటి స్థలాలు, ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.
చిన్న, మధ్య తరహా పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా, ఫొటో జర్నలిస్టులకు సమాన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సభ్యత్వ విస్తరణతో పాటు మండల స్థాయి కమిటీలను మరింత క్రియాశీలం చేయాలని సూచించారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే. పైసల్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధనకు సంఘటిత శక్తే ప్రధాన బలమన్నారు. సమస్య ఏ ఒక్క జర్నలిస్టుదైనా యూనియన్ సమస్యగా భావించి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో అర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరిగేలా యూనియన్ కృషి చేస్తుందని తెలిపారు.
సమావేశంలో జిల్లా, నియోజకవర్గ నాయకులు, ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొని స్థానిక సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.

