సంగారెడ్డి, నవజ్యోతి వెబ్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని తెలిపారు. మరో రెండేళ్లలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉచిత బస్సు ప్రయాణం, పావలా వడ్డీ రుణాలు, పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళలను బస్సుల యజమానులుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేకత అన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని నిర్మలా జగ్గారెడ్డి పేర్కొన్నారు. సన్న బియ్యం పండించే రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి ఆహార భద్రత కల్పిస్తున్నామని, రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇల్లు లేని నిరుపేదల కలను సాకారం చేస్తున్నామని తెలిపారు. విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. యువతకు ప్రాధాన్యతనిస్తూ 70 వేలకు పైగా ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చేర్యాల ఆంజనేయులు, జార్జ్, ఆర్. కిరణ్ గౌడ్, కూన సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన: నిర్మలా జగ్గారెడ్డి
RELATED ARTICLES

