📄 ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌కు సీఎం రేవంత్‌ ఆహ్వానం !

ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌కు సీఎం రేవంత్‌ ఆహ్వానం !

డిఫెన్స్‌ ఎక్స్‌పో–2026 ప్రారంభించాలని విజ్ఞప్తి.. రక్షణ రంగ సంస్థలు, త్రివిధ దళాల భాగస్వామ్యానికి సహకరించాలని కోరిన సీఎం

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 2 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026కు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆహ్వానించారు. డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న ఈ సదస్సులో భాగంగా డిఫెన్స్‌ ఎక్స్‌పో–2026ను ప్రారంభించాలని కోరారు.

డిఫెన్స్‌ ఎక్స్‌పోకు రాజ్‌నాథ్‌ను ఆహ్వానించిన సీఎం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలువురు ఎంపీలతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న డిఫెన్స్‌ ఎక్స్‌పో–2026లో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, స్పేస్‌ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సుతో పాటు ప్రతిష్టాత్మక ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సీఎం వివరించారు.

సూర్యకిరణ్‌, సారంగ్‌ బృందాలకు విజ్ఞప్తి

డిఫెన్స్‌ ఎక్స్‌పోకు దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు హాజరు కానున్న నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి పాల్గొని మార్గనిర్దేశం చేయాలని సీఎం కోరారు. ఎయిర్‌షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్‌, సారంగ్‌ ఏరోబాటిక్‌ బృందాలు ప్రదర్శనలో పాల్గొనేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

త్రివిధ దళాల అత్యాధునిక వ్యవస్థల ప్రదర్శన

స్టాటిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రదర్శనకు కూడా సహకరించాలని సీఎం కోరారు. భూ, నౌకా, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఎక్స్‌పోలో ఏర్పాటు చేయడంతో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

డీఆర్‌డీవో, రక్షణ సంస్థల భాగస్వామ్యం

హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, ఎండీఎల్‌ తదితర రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, డీఆర్‌డీవో ప్రయోగశాలలు డిఫెన్స్‌ ఎక్స్‌పోలో విస్తృతంగా పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించాలని సీఎం కోరారు. విదేశీ రక్షణ శాఖ ప్రతినిధులు, ద్వైపాక్షిక రక్షణ ప్రతినిధి బృందాలు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి మరో 750 ఎకరాలు

ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి సంబంధించి ఇప్పటికే 750 ఎకరాల భూమిని సేకరించామని ముఖ్యమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు వివరించారు. రక్షణ శాఖ మొత్తం 1,500 ఎకరాలు కోరిన నేపథ్యంలో మరో 750 ఎకరాలు సేకరించి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

మహబూబ్‌నగర్‌లో డీఆర్‌డీఎల్‌ ప్రాజెక్టు

మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్‌డీఎల్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు టీజీఐఐసీ ఇప్పటికే అంగీకరించిందని సీఎం తెలిపారు. మొత్తం భూమికి సంవత్సరానికి కేవలం రూ.1 నామమాత్రపు లీజు అద్దెతో 33 సంవత్సరాల కాలానికి భూమిని కేటాయించనున్నట్లు వివరించారు. అవసరమైతే మరో రెండుసార్లు లీజు పొడిగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

సీఎంతో పాటు ఎంపీలు హాజరు

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్ర శక్తి శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి, ఎంపీలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, మల్లు రవి, సురేష్‌ షెట్కార్‌, బలరాం నాయక్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్‌) హర్కర రామారావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో డిఫెన్స్‌ ఎక్స్‌పో

హైదరాబాద్‌లో డిఫెన్స్‌ ఎక్స్‌పో–2026ను అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవంతంగా నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. స్వదేశీ రక్షణ సాంకేతికత, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, స్పేస్‌ రంగాలకు తెలంగాణను కీలక వేదికగా నిలిపేలా ఎక్స్‌పోను నిర్వహించనున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!