📄 ePaper
Sunday, August 23, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిఫోటో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి !.. అర్హులైన వారిని ఆదుకోవాలి.. టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు...

ఫోటో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి !.. అర్హులైన వారిని ఆదుకోవాలి.. టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి వినతి

సంగారెడ్డి, ఆగష్టు 22 (నవజ్యోతి వెబ్) : ఫోటో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని టియుడబ్ల్యూజే ఐజేయు సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే పైసల్ కోరారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో శనివారం ఫోటోల ప్రదర్శనను నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్ పాండు, డిపిఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వైద్యనాథ్,
బిజెపి సీనియర్ నాయకుడు కొండాపురం జగన్, యువజన సంఘాల నాయకుడు కూన వేణు, ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఇతర ముఖ్యులు సంతోష్, పవన్, రాజు, కృష్ణ, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ స్పాట్ ఫోటోల కోసం, ప్రజా సమస్యలను మరింత త్వరగా వెలుగులోకి తెచ్చేందుకు ఫోటో జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులతో పాటు ఫోటో జర్నలిస్టులు కలిసి పనిచేయడం వల్లనే అనేక ప్రజా సమస్యలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి ఉధృతంగా వెళుతున్నాయని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని, ఫోటో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా అర్హులైన ఫోటో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా చాలా మంది పనిచేస్తున్నప్పటికీ, వారికి కనీసం విలువ నీడ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని కాపాడుకునే పరిస్థితులు కూడా లేవని అన్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే, అనారోగ్యం బారిన పడితే, వైద్యం చేయించుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అందువల్ల హెల్త్ కార్డును కూడా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వానికి నివేదిస్తామని, అర్హులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉన్నప్పుడు తనను కలిస్తే, చేతనైనంత మేరకు అండగా ఉంటామని బదులిచ్చారు. ఎలాంటి అధైర్య పడొద్దని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు యాదగిరిని, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే పైసల్ ను ఫోటో జర్నలిస్టు సంఘం నాయకులు సన్మానించారు. మెమెంటోను అందజేశారు. పలువురు జర్నలిస్టు సంఘం నాయకులు, మీడియా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!