సంగారెడ్డి, ఆగస్టు12 (నవజ్యోతి ప్రతినిధి) : రహమాన్ కు కోచ్ శేషుకుమార్ అభినందనలు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రతిభావంతుడైన స్విమ్మర్ మొహమ్మద్ అబ్దుర్ రహమాన్ సిద్ధీఖ్ జాతీయ స్థాయి వాటర్‌పోలో పోటీలకు ఎంపికయ్యారు. ఆయన స్విమ్మింగ్ కోచ్ శేషుకుమార్ ప్రత్యేకంగా అభినందిస్తూ, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన 11వ తెలంగాణ సబ్-జూనియర్, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్–2026 ఎంపిక ట్రయల్స్‌లో అబ్దుర్ రహమాన్ సిద్ధీఖ్ ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలోని అక్వాటిక్ కాంప్లెక్స్‌లో జూలై 25న జరిగిన ఎంపిక ప్రక్రియలో ఎంపికయ్యారు. 52వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్–2026 (వాటర్‌పోలో టీమ్)లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ జాతీయ స్థాయి పోటీలు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న ఐడిఏ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్, పిప్లియాహానా స్క్వేర్ వేదికగా సెప్టెంబర్ 7 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రెటరీ ఉమేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల అబ్దుర్ రహమాన్ సిద్ధిఖీని కోచ్ శేషుకుమార్ అభినందించారు. క్రమశిక్షణతో కూడిన సాధన, పట్టుదల, నిరంతర శ్రమతోనే ఇలాంటి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణకు, సంగారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయి వాటర్‌పోలో పోటీలకు ఎంపిక కావడం ద్వారా అబ్దుర్ రహమాన్ సిద్ధీఖ్ తన క్రీడా ప్రతిభకు మరో మైలురాయిని జోడించారు. రాబోయే పోటీల్లో విజయవంతంగా రాణించి మరిన్ని ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని డివైఎస్ఓ ధనంజేయులు ఆకాంక్షించారు. తమ కుమారుడు జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన రెహమాన్ తల్లిదండ్రులు, ఈ విజయ ప్రయాణంలో కోచ్ శేషుకుమార్ అందించిన సహకారం, ప్రోత్సాహం, మార్గదర్శకత్వాన్ని ఎప్పటికీ మరువలేమని తెలిపారు.రహమాన్ జాతీయ స్థాయి వాటర్‌పోలో పోటీలకు ఎంపిక కావడంలో స్విమ్మింగ్ కోచ్ శేషుకుమార్ అందించిన శిక్షణ, మార్గదర్శకత్వం ఎంతో కీలకమని రెహమాన్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా తమ కుమారుడికి క్రమం తప్పకుండా శిక్షణ అందిస్తూ, అతని ప్రతిభను గుర్తించి మరింత మెరుగ్గా రాణించేలా ప్రోత్సహించిన కోచ్ శేషుకుమార్‌కు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.కేవలం ఈతలో నైపుణ్యాన్ని పెంపొందించడమే కాకుండా, పోటీలను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన వంటి లక్షణాలను జిల్లా స్విమ్మర్స్ లో పెంపొందించారని పేర్కొన్నారు.
జాతీయ వాటర్‌పోలో పోటీలకు సంగారెడ్డి స్విమ్మర్ ఎంపిక
RELATED ARTICLES

