📄 ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు హైకోర్టు బ్రేక్‌!

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు హైకోర్టు బ్రేక్‌!

చెల్లింపులపై మధ్యంతర స్టే.. సెప్టెంబర్‌ 9కు తదుపరి విచారణ

హైదరాబాద్‌, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద చెల్లింపులపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ రెండు పథకాల కింద చెల్లింపులు చేయవద్దని ఆదేశించింది. పథకాల చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.

జీవోలతోనే అమలు చేస్తున్నారంటూ పిటిషన్‌

పథకాల అమలుకు శాసనసభ ఆమోదించిన ప్రత్యేక చట్టం లేదని, కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోలు) ఆధారంగానే పథకాలను అమలు చేస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పథకాల అమలుకు చట్టపరమైన మద్దతు లేదని వాదించారు.

గత విచారణలో ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే గడువు పూర్తయినా కౌంటర్‌ దాఖలు కాలేదని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం మరింత సమయం కోరడంతో కోర్టు చెల్లింపులపై మధ్యంతర స్టే విధించింది.

సెప్టెంబర్‌ 9కు తదుపరి విచారణ

ఈ కేసును సెప్టెంబర్‌ 9కు వాయిదా వేసింది. అప్పటివరకు పథకాల కింద కొత్త చెల్లింపులు నిలిచిపోనున్నాయి. అయితే పథకాల భవిష్యత్‌ అమలుపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు.

ఒక్కో లబ్ధిదారుకు రూ.1,00,116

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద అర్హులైన వధువులకు ప్రస్తుతం ఒక్కసారి రూ.1,00,116 ఆర్థిక సాయం అందుతోంది. దివ్యాంగ వధువులకు రూ.1,25,145 చెల్లించే నిబంధన ఉంది.

కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు, షాదీముబారక్‌ ద్వారా మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన వధువులకు వివాహ సమయంలో ఆర్థిక సాయం అందుతోంది.

హైకోర్టు మధ్యంతర స్టేతో లబ్ధిదారుల చెల్లింపులపై తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. సెప్టెంబర్‌ 9న జరిగే తదుపరి విచారణలో ప్రభుత్వం తన వాదనలు, పథకాల అమలుకు సంబంధించిన చట్టపరమైన ఆధారాలను కోర్టు ముందు సమర్పించాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!