ఇటలీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న రిష్వితతో పాటు మరో ఇద్దరు యువ సెయిలర్లు….
భిక్కనూరు, కామారెడ్డి జూలై 24 (నవజ్యోతి ప్రతినిధి):
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన రిష్విత 2026 అంతర్జాతీయ క్యాడెట్ ప్రపంచ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. జూలై 30 నుంచి ఆగస్టు 7 వరకు ఇటలీలోని టోర్బోలే సుల్ గార్డాలో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో ఆమె భారత జట్టు తరపున పోటీ పడనుంది.
భిక్కనూరుకు చెందిన శ్రీకాంత్ గౌడ్ కుమార్తె రిష్విత ప్రస్తుతం మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఆమెతో పాటు హనుమంతు వాద్త్య, కౌనిక్ వర్ధన్ దేవరాజు కూడా భారత జట్టుకు ఎంపికయ్యారు.
ది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఈ ముగ్గురు యువ సెయిలర్లు అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. రిష్విత ఎంపికలో ది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, షైక్ సుహైమ్, కార్తికేయన్, శ్రీనివాస్ గౌడ్ అందించిన సహకారం కీలకమని నిర్వాహకులు తెలిపారు.
భిక్కనూరు విద్యార్థిని ప్రపంచ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని పలువురు అభినందనలు తెలియజేస్తూ, రిష్వితతో పాటు హనుమంతు వాద్త్య, కౌనిక్ వర్ధన్ దేవరాజు అంతర్జాతీయ వేదికపై అత్యుత్తమ ప్రతిభ కనబర్చి భారతదేశానికి, తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

