ఆరు గ్రామాల యువతకు క్రికెట్ మహోత్సవం.. కెపిఎల్ డి –2027కు శ్రీకారం
సంక్రాంతి వేళ క్రీడా సంబరాలకు సిద్ధం.. కెపిఎల్ డి టోర్నీ రిజిస్ట్రేషన్ ప్రారంభం
గ్రామీణ క్రికెట్ ప్రతిభకు వేదికగా కెపిఎల్ డి–2027
యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం.. కెపిఎల్ డి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
రామాయంపేట జూలై 5 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) : మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల్,పర్వతాపూర్,లక్ష్మాపూర్, ధంతేపల్లి,కిషన్ తండా,జామ్లా తండా గ్రామాల యువత భాగస్వామ్యంతో నిర్వహించనున్న కేపీఎల్డీ (కాట్రియాల్,పర్వతాపూర్,లక్ష్మాపూర్, దంతేపల్లి)విలేజ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్–2027 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆరు గ్రామాల సర్పంచ్ ల , ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఘనంగా ప్రారంభించారు. సంక్రాంతి–2027 సందర్భంగా నిర్వహించనున్న ఈ ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నమెంట్ ద్వారా గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి,వారికి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే వేదిక కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యువతలో శారీరక దృఢత్వం,క్రీడాస్ఫూర్తి, జట్టు భావన,నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు గ్రామాల మధ్య ఐక్యత, స్నేహపూర్వక వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడమే టోర్నీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా టోర్నీ విజయవంతానికి సహకరిస్తున్న ఆరు గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు,గ్రామ పెద్దలు, యువత, ప్రజలకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఆసక్తి గల జట్లు,ఆటగాళ్లు ఆలస్యం చేయకుండా వెంటనే తమ పేర్లను నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఆగస్టు 15 2026 పూర్తి అవుతుంది.మిగతా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో లక్ష్మాపూర్ సర్పంచ్ గొల్లపల్లి నవీన్ గౌడ్, కాట్రియాల్ సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా, పర్వతాపూర్ సర్పంచ్ తార్య నాయక్, కిషన్ తండా సర్పంచ్ రాణి రాజునాయక్, జామ్లా తండా బాన్సీలాల్ నాయక్, దంతేపల్లి సర్పంచ్ మస్కూరి బలరాజ్,కాట్రియాల్ ఉపసర్పంచ్ బాబు, లక్ష్మాపూర్ ఉపసర్పంచ్ విజయ్ భాస్కర్ రెడ్డి, కెపిఎల్ డి ఆర్గనైజర్స్, క్రీడాకారులు, యువత, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

