📄 ePaper
Wednesday, August 19, 2026
📄 ePaper
Homeతెలంగాణనవజ్యోతి ఎఫెక్ట్..షెడ్డుకు నోటీసుల షాక్!.. కథనం మరుసటి రోజే నోటీసులు..పనులకు అధికారుల బ్రేక్

నవజ్యోతి ఎఫెక్ట్..షెడ్డుకు నోటీసుల షాక్!.. కథనం మరుసటి రోజే నోటీసులు..పనులకు అధికారుల బ్రేక్

అనుమతులేంటి? భద్రతా ప్రమాణాలెక్కడ? అన్నదానిపై అధికారుల ఆరా

నోటీసులు జారీ..ఇక ఎలాంటి నిర్మాణ పనులు చేయొద్దంటూ హెచ్చరిక!

కుత్బుల్లాపూర్, ఆగస్టు 17 (నవజ్యోతి ప్రతినిధి)

ఒక ప్రమాదం.. ఆగని నిర్మాణ పనులు.. అధికారుల మౌనం.. చివరకు నవజ్యోతి ప్రశ్న. కథనం వెలువడిన వెంటనే టౌన్‌ ప్లానింగ్ కదిలింది. దుందిగల్ సర్కిల్ పరిధిలోని చర్చ్‌గాగిల్లాపూర్‌లో ఎస్సార్ ఎన్విరాన్ ఎయిర్ సిస్టమ్స్‌లో ప్రమాదం జరిగిన షెడ్డులో పనులు కొనసాగుతున్న అంశంపై నవజ్యోతి ప్రచురించిన కథనానికి అధికారుల నుంచి స్పందన వచ్చింది.

జూలై 9న ఫ్యాబ్రికేషన్ పనులు జరుగుతున్న సమయంలో 43 ఏళ్ల లంక భాస్కరరావు షెడ్డుపై నుంచి కిందపడిన ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం తర్వాత నిర్మాణ భద్రతపై సమగ్ర పరిశీలన జరగాల్సి ఉన్నా.. పనులు మాత్రం కొనసాగుతుండటంపై నవజ్యోతి ప్రశ్నలు సంధించింది.

కథనం పడగానే..నోటీసులు

‘ప్రమాదం జరిగినా.. షెడ్డు పనులకు బ్రేక్ లేదా?’ అంటూ ప్రచురించిన కథనం అధికారుల దృష్టిని ఆకర్షించింది. కథనం ప్రచురితమైన మరుసటి రోజే, ఈ నెల 14న సంబంధిత టౌన్‌ ప్లానింగ్ అధికారులు షెడ్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అనంతరం టౌన్‌ ప్లానింగ్ సిబ్బంది అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేశారు.

పని చేయొద్దు..అధికారుల స్పష్టీకరణ

నిర్మాణ పనులు కొనసాగించరాదని నిర్వాహకులకు అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో ప్రమాదం జరిగిన ప్రదేశంలో కొనసాగుతున్న పనులకు బ్రేక్ పడింది. అయితే నోటీసులతో పాటు షెడ్‌కు సంబంధించిన అనుమతులు, మంజూరైన ప్లాన్, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా ఉందా? అన్న అంశాలపై పూర్తిస్థాయి పరిశీలన జరగాల్సి ఉంది.

నోటీసులు వచ్చాయి..సమాధానాలు రావాలి!

షెడ్ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ నిబంధనల ప్రకారం మంజూరయ్యాయి? మంజూరైన ప్లాన్‌నే అమలు చేస్తున్నారా? ప్రమాదం తర్వాత పనులు కొనసాగించేందుకు అనుమతి ఉందా? అనే ప్రశ్నలకు అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ప్రమాదం ఒక హెచ్చరిక..చర్యలు మరో సంకేతం

ప్రమాదం జరిగిన ప్రదేశంలో పనులు కొనసాగడం స్థానికుల్లో ఆందోళనకు కారణమైంది. నవజ్యోతి కథనంతో పనులు నిలిచిపోవడం కొంత ఊరట కలిగించినా.. నిర్మాణం వెనుక ఉన్న అనుమతులు, భద్రతా ప్రమాణాలు, నిబంధనల అమలుపై అధికారుల తుది నివేదికే అసలు విషయాన్ని తేల్చనుంది.

ప్రమాదాన్ని వెలుగులోకి తెచ్చిన కథనం.. అధికారులను కదిలించిన స్పందన.. షెడ్డుకు బ్రేక్. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే—నోటీసులతో ఆగుతుందా? లేక నిబంధనలపై పూర్తిస్థాయి చర్యలు ఉంటాయా? వేచి చూడాల్సిందే మరి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!