అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి : ఎమ్మెల్యే
భక్తిశ్రద్ధలతో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు : మున్సిపల్ ఛైర్పర్సన్
రామాయంపేట, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) :

మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల పండుగను ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో, కోలాహలంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ వార్డుల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల ఉత్సవాలతో రామాయంపేట పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది.బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన తొట్టెల ఊరేగింపు, పలారం బండ్ల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, భక్తుల పూనకాలతో ప్రధాన వీధులు మార్మోగాయి. అనంతరం నిర్వహించిన రంగం కార్యక్రమం భక్తులను అలరించింది. అమ్మవారి కృప, ఆశీస్సులు తమ కుటుంబాలపై ఉండాలని కోరుతూ భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు.సాయంత్రం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు వేద మంత్రోచ్ఛారణల మధ్య కుంభంతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఎమ్మెల్యే రోహిత్ రావు రామాయంపేట పట్టణంలోని వివిధ దేవాలయాలను సందర్శించి దుర్గమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ తదితర అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఫలహారం బండి, రథయాత్ర కార్యక్రమాల్లో పాల్గొని భక్తులతో కలిసి ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు మాట్లాడుతూ మహంకాళి అమ్మవారి దివ్య ఆశీస్సులతో రామాయంపేట పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పట్టణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.మున్సిపల్ కౌన్సిలర్ నాగరాజు మాట్లాడుతూ ఆషాఢ మాసం బోనాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు దేవుని రంజిత్, దాకి శ్యామల స్వామి, చింతల రాధా భవాని యాదగిరి, చింతల స్వప్న స్వామి, మద్దెల మాధవి రమేష్, సుంకోజి దామోదర్, మంజుల సుందర్ సింగ్, అనిత శ్రీశైలం, సామల రవి, దారం సంతోష్, బీర రామచంద్రం, మంగలి సత్యం, దోమకొండ యాదగిరి, భూమా కిషన్, ఇసుక ప్రకాష్, బైరామ్ స్వప్నకుమార్, రవినాయక్, పుట్టి సందీప్, ఆలయ ఈవో రవికుమార్, ఆలయ చైర్మన్ సరాఫ్ పాండురంగచారి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చింతల స్వప్న స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

