కుత్బుల్లాపూర్ జులై 5: (నవజ్యోతి ప్రతినిధి)
వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజుకు ఛాతి భాగంలో తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాద సమయంలో కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న ఆయనకు బలమైన దెబ్బ తగలడంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది.
అప్రమత్తమైన పార్టీ నేతలు, భద్రతా సిబ్బంది వెంటనే ఎమ్మెల్సీని ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కొంపల్లిలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం.
ఈ ఘటన సమాచారం అందుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

