ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పనులపై క్షేత్రస్థాయిలో సమీక్ష.
పెండింగ్ దరఖాస్తులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం.
రామాయంపేట , జులై 15 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) :
రామాయంపేట మండలం కాట్రీయాల్ గ్రామంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను బుధవారం నాడు ఆర్డీవో కార్యాలయ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా బూత్ స్థాయిలో జరుగుతున్న నమోదు, ధృవీకరణ,డిజిటలైజేషన్ పనులను సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పూర్తి చేయాలని బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు సూచించారు.ఆర్డీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్లు ఎ.సందీప్, బి. ప్రవీణ్, ఈఆర్‌వో నెట్ ఆపరేటర్ రాజ్ కుమార్ పరిశీలన నిర్వహించారు.ఓటరు జాబితా సవరణలో ఎదురవుతున్న పలు సమస్యలపై సిబ్బందికి అవగాహన కల్పించి,మరణించిన ఓటర్ల వివరాల నమోదు,డూప్లికేట్ నమోదుల తొలగింపు,కొత్త ఓటర్ల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సూచించారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

