కుత్బుల్లాపూర్, జూలై 15 (నవజ్యోతి ప్రతినిధి):ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యంగా సిఎంసి చేపట్టిన “ఒక వార్డు–ఒక రోజు” కార్యక్రమంలో భాగంగా 287 పేట్‌బషీరాబాద్ వార్డులో కమిషనర్ డా. జి. సృజన ఐఏఎస్ విస్తృతంగా పర్యటించారు. జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్, డిప్యూటీ కమిషనర్ డి. శంకర్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సత్యం ఎన్‌క్లేవ్ పార్క్‌లో నిర్వహించిన సమావేశంలో కాలనీల ఆర్‌డబ్ల్యూఏలు, నివాసితుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను నేరుగా కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజీ అవుట్‌లెట్లు, తాగునీటి కొరత, రోడ్ల విస్తరణ, ఫుట్‌పాత్ ఆక్రమణలు, అక్రమ పార్కింగ్, పార్కుల అభివృద్ధి, సీసీ రోడ్లు, పారిశుధ్యం, వీధి దీపాలు, ప్రభుత్వ పాఠశాల, ఆరోగ్య కేంద్రం, రేషన్ షాపు వంటి పలు మౌలిక వసతుల సమస్యలను వివరించారు.
ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని నమోదు చేసిన కమిషనర్ డా. సృజన, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అధికారులు నేరుగా వార్డుల్లోకి వెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా “వన్ వార్డు–వన్ డే” కార్యక్రమాన్ని మరింత ఫలవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే వార్డుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

