📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుచారంలో 20 ఆధునిక నిఘా కెమెరాల ప్రారంభం..

కుచారంలో 20 ఆధునిక నిఘా కెమెరాల ప్రారంభం..

ఐటీసీ సహకారంతో భద్రతకు మరింత బలం.. డ్రగ్స్‌, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

మనోహరాబాద్, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి నవీన్):

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కుచారం గ్రామంలో ఐటీసీ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన 18 సీసీ కెమెరాలు, రెండు ఏఎన్‌పీఆర్ (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు.

భద్రతకు సాంకేతిక బలం

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం” అని పేర్కొన్నారు. గ్రామంలోకి వచ్చే, వెళ్లే వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, దర్యాప్తులో సాక్ష్యాల సేకరణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

ఏఎన్‌పీఆర్ కెమెరాల ప్రత్యేకత

ఏఎన్‌పీఆర్ కెమెరాల ద్వారా వాహనాల నంబర్ ప్లేట్లను స్వయంచాలకంగా గుర్తించి, నేరాలకు పాల్పడిన లేదా అనుమానాస్పద వాహనాలను వేగంగా గుర్తించే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు. గ్రామాల్లో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఈ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.

డ్రగ్స్‌, సైబర్ నేరాలపై హెచ్చరిక

యువత మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించిన ఎస్పీ, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే 1908 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు.

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ చెప్పవద్దని, గుర్తు తెలియని లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

ఐటీసీకి అభినందనలు

కుచారం గ్రామంలో ఆధునిక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడంలో సహకరించిన ఐటీసీ సంస్థ ప్రతినిధులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, పోలీసు అధికారులు, ఐటీసీ ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!