మరో ప్రమాదం.. బీజేపీ హెచ్చరిక
రామాయంపేట, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి రాజా గౌడ్): రామాయంపేట వై జంక్షన్ వద్ద మరోసారి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. మహిళకు తలకు తీవ్ర గాయాలతో పాటు చేయి విరిగినట్లు వైద్యులు గుర్తించి మెరుగైన చికిత్స కోసం సిద్ధిపేటకు తరలించాలని సూచించారు.
వై జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడగా, మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు సిద్ధిపేటకు రిఫర్ చేశారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం లేకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వై జంక్షన్‌ను వెంటనే మూసివేయాలని తాము మొదటి నుంచే డిమాండ్ చేస్తున్నప్పటికీ నేషనల్ హైవే అథారిటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించింది. ఇటీవల అధికారులతో సమావేశమై సమస్యను వివరించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.
ఈ అంశాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకెళ్తున్నామని, నేషనల్ హైవే అథారిటీ వెంటనే స్పందించి వై జంక్షన్‌ను శాశ్వతంగా మూసివేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.
రేపటిలోగా అధికారులు చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వై జంక్షన్‌ను మూసివేసి నిరసన కార్యక్రమాలు చేపడతామని పార్టీ నాయకులు హెచ్చరించారు.

