సీసీటీవీ క్లూలతో ముఠా బట్టబయలు.. రూ.3.25 లక్షల నగదు, స్కూటీ స్వాధీనం
నల్గొండ, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి): నల్గొండ పట్టణంలో ఇటీవల వరుస పగటి చోరీలతో ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు జిల్లా పోలీసులు తెరదించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఛేదించి, ఢిల్లీకి చెందిన మహమ్మద్ నసీమ్ (48)ను అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.3.25 లక్షల నగదు, డీఎల్–5ఎస్–డీఎస్–1374 నంబర్ స్కూటీ, రెండు ఇనుప రాడ్లు, మాస్క్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ జి. రమేష్, డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో వన్‌టౌన్ సీఐ ఎం. రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ కె. ఆది రెడ్డి, వన్‌టౌన్ ఎస్‌ఐ సైదా బాబు నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని విశ్లేషించి పానగల్ బైపాస్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితుడు నల్గొండ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తిరుపతి, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, ఢిల్లీలో పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ముఠాకు చెందిన ఇర్షాద్, షరీఫ్ పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు వివిధ రాష్ట్రాల్లో గాలింపు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కేసును ఛేదించిన సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు.

