📄 ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
Homeమెదక్తెలంగాణ ఉద్యమకారుల హామీలను వెంటనే అమలు చేయాలి.

తెలంగాణ ఉద్యమకారుల హామీలను వెంటనే అమలు చేయాలి.

ఉమ్మడి నిజాంపేట–రామాయంపేట ఉద్యమకారుల డిమాండ్.

రామాయంపేట, జులై 15 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) : 

ఉమ్మడి నిజాంపేట–రామాయంపేట మండలాలకు చెందిన సుమారు 15 మంది తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కల్పించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసి, పోరాటాల్లో పాల్గొన్న ఉద్యమకారుల సేవలను ప్రభుత్వం గుర్తించి వారికి తగిన గౌరవం, సంక్షేమ పథకాలు అందించాలని వారు డిమాండ్ చేశారు.ఎన్నికల హామీలలో భాగంగా ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల గౌరవ పెన్షన్, ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం, ఉచిత ఆర్టీసీ బస్ పాస్, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుల కుటుంబాల సామాజిక, ఆర్థిక భద్రత కోసం ప్రత్యేక సంక్షేమ విధానాన్ని రూపొందించాలని కోరారు.అదేవిధంగా ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం), జనవరి 26 (గణతంత్ర దినోత్సవం), జూన్ 2 (తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం) సందర్భంగా నిర్వహించే అధికారిక వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించి, శాలువా, సన్మానం, ప్రశంసాపత్రాలతో ప్రభుత్వం గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు అధికారిక గుర్తింపు కార్డులు జారీ చేయాలని కూడా కోరారు.ఈ సందర్భంగా మెదక్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ గుండా ఎల్లం, మాజీ ఎంపీటీసీ మైలారం బిక్షపతి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చిలుక గంగాధర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన వేలాది మంది కార్యకర్తల త్యాగాలు మరువరానివని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆలస్యం చేయకుండా అమలు చేసి, ఉద్యమకారుల పట్ల కృతజ్ఞత చాటుకోవాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!