కామారెడ్డి, జూలై 1 (నవజ్యోతి ప్రతినిధి):
కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. బుధవారం కామారెడ్డి పట్టణంలోని నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. తాను చదివిన కామారెడ్డి బాయ్స్ హైస్కూల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.5 కోట్లు మంజూరు చేశారని, అక్కడ ఏసీ తరగతి గదులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్స్, స్మార్ట్ లైబ్రరీ, క్రీడా మైదానాలతో రాష్ట్రంలోనే ఆదర్శ ప్రభుత్వ పాఠశాలగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అవసరమైతే తన సొంత నిధులు కూడా వినియోగిస్తానన్నారు.
ఇందిరాగాంధీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని, సీఎస్ఆర్ నిధులతో రూ.78 లక్షల వ్యయంతో జర్మన్ టెక్నాలజీ డేలైట్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.9 కోట్లతో 8 లేన్ అథ్లెటిక్స్ ట్రాక్, టెన్నిస్ కోర్టులు, వాలీబాల్ కోర్టు, యోగా భవన్, ఆధునిక జిమ్, రైఫిల్ షూటింగ్ సదుపాయం, డ్రెస్ చేంజింగ్ రూములు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తామని చెప్పారు.
దోమకొండలో రూ.10 కోట్లతో ఫైర్ స్టేషన్, 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, ఎమ్మార్వో కార్యాలయ నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు లభించాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. పట్టణంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పార్కులు, సీసీ రోడ్లు, భూగర్భ మురుగు కాలువల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తుండగా, గ్రామాల్లో రహదారులు, సాగునీరు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిపై దృష్టి సారించామని తెలిపారు.
పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు స్థానికంగా ఉపాధి కల్పించడంతో పాటు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు సాగునీరు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని, మార్కెటింగ్ సదుపాయాలు, గోదాములు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి కామారెడ్డి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రితో త్వరలో చర్చిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన మార్పుల వల్లే జిల్లాకు సాగునీరు అందడంలో ఆటంకాలు ఏర్పడ్డాయని విమర్శించారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

