కుల్గామ్‌లో ఒకరు మృతి, మరొకరికి గాయాలు.. లష్కరే తోయిబాపై అనుమానాలు !
జమ్మూకాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు పహల్గామ్ దాడిని తలపించేలా మరో దారుణానికి పాల్పడ్డారు. ఇటుక బట్టీలో పనిచేస్తున్న వలస కార్మికుల పేర్లు అడిగిన అనంతరం ఇద్దరు హిందూ కార్మికులను వేరుచేసి అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కార్మికుడు మృతిచెందగా, మరో కార్మికుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న పలువురు కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే అయినప్పటికీ, బాధితులైన ఇద్దరే హిందువులు కావడంతో మతపరమైన లక్ష్యంతోనే ఈ దాడి జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనలో ఒక స్థానిక ఉగ్రవాది, ఒక విదేశీ ఉగ్రవాది ప్రమేయం ఉండొచ్చని దర్యాప్తు కొనసాగుతోంది. గత ఏడాది లష్కరే తోయిబా/ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)లో చేరిన మహ్మద్ లతీఫ్ పాత్రపై కూడా విచారణ సాగుతోంది.
ఈ ఘటనను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులను వెంటనే మట్టుబెట్టాలని భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఘటనాస్థలాన్ని పోలీసులు, భద్రతా బలగాలు చుట్టుముట్టి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ ఉగ్రదాడిని జమ్మూకాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా ఖండిస్తూ, ఉగ్రవాదంపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది.

