ప్రజాస్వామ్య పరిరక్షణలో పనిచేసిన కాంగ్రెస్ శ్రేణులకు అభినందనలు తెలిపిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్ అలీ
కామారెడ్డి, ఆగస్టు 1 (నవజ్యోతి ప్రతినిధి):
కామారెడ్డి నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ విజయవంతంగా పూర్తికావడం పట్ల రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్ అలీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నాయకత్వంలో, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ సమన్వయంతో SIR ప్రక్రియ దాదాపు 100 శాతం విజయవంతంగా పూర్తైందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన ఓటరికి న్యాయం జరిగేలా ఇంటింటికీ వెళ్లి శ్రమించిన బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బూత్ స్థాయి నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తల కృషి అభినందనీయమని ఇలియాస్ అలీ అన్నారు. ఈ విజయానికి మార్గదర్శకులైన మహమ్మద్ అలీ షబ్బీర్, ఏలే మల్లికార్జున్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే సేవా స్ఫూర్తితో గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అంకితభావంతో పనిచేసిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు, BLAలు, పార్టీ నాయకులు, కార్యకర్తల సేవలను కొనియాడారు. వారి కృషిని గుర్తిస్తూ మండల కాంగ్రెస్ అధ్యక్షులకు ప్రత్యేక ప్రశంసా పత్రాలను అందజేశారు.


ప్రతి అర్హుడైన ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా బాధ్యతాయుతంగా పనిచేసిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి బలమని ఆయన అన్నారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీ శ్రేణులు చూపిన సమన్వయం, నిబద్ధత ప్రశంసనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్ అలీ, కామారెడ్డి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, మండల నాయకులు, BLAలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

