కుత్బుల్లాపూర్, ఆగస్టు 1 : (నవజ్యోతి ప్రతినిధి) సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటరామ నగర్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న నకిలీ క్లినిక్‌పై సూరారం పోలీసులు, ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్ బృందం సంయుక్తంగా దాడి నిర్వహించి బోగస్ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. జూలై 31న విశ్వసనీయ సమాచారం మేరకు బచ్‌పన్ స్కూల్ సమీపంలోని “రక్షిత క్లినిక్”పై దాడి చేయగా, క్లినిక్ నిర్వహిస్తున్న సనాది కర్ణాకర్ (35) ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య అర్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, వైద్య వృత్తికి అవసరమైన లైసెన్స్ లేకుండానే డాక్టర్‌గా చెలామణి అవుతూ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు
పోలీసుల విచారణలో నిందితుడు గత సుమారు ఏడాది కాలంగా రోగులను పరీక్షించి మందులు అందించడం, కన్సల్టేషన్ ఫీజులు, మందుల పేరుతో నగదు వసూలు చేస్తూ అక్రమంగా వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని సూరారం పోలీస్ స్టేషన్‌లో సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రజలు వైద్య సేవలు పొందే ముందు సంబంధిత వైద్యుడికి చెల్లుబాటు అయ్యే వైద్య అర్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు సూచించారు. తమ ప్రాంతాల్లో నకిలీ వైద్యులు లేదా అక్రమంగా క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

