సంగారెడ్డి, జూలై 29 (నవజ్యోతి ప్రతినిధి)
మూడున్నరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇచ్చిన మాటను నేటికీ నిలబెట్టుకుంటున్నానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ బీఎల్‌ఏల సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై తన వైఖరిని వివరించారు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి తనకు ఆహ్వానం అందిందని, ఆ సందర్భంగా ఆయనతో సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం లభించిందని తెలిపారు. తన రాజకీయ ప్రయాణం సంగారెడ్డి రాంనగర్‌లోని రామాలయం వద్ద విద్యార్థి నాయకుడిగా ప్రారంభమై, నేడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఎదుట కూర్చునే స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందని ఆ సందర్భంగా చెప్పినట్లు వెల్లడించారు. ఆ సమావేశంలో రాహుల్ గాంధీ తనను పక్కకు పిలిచి, “ఎవరిపైనా కోపం ఉన్నా మీడియా ముందు మాట్లాడొద్దు… ఢిల్లీకి వచ్చి నాతో మాట్లాడండి” అని సూచించారని జగ్గారెడ్డి తెలిపారు. ఆ మాటకు కట్టుబడి గత మూడున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాలపై ఎక్కడా బహిరంగంగా వ్యాఖ్యానించలేదని స్పష్టం చేశారు. ఏదైనా అంశంపై మాట్లాడాల్సిన అవసరం వస్తే ముందుగా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాతే ప్రజల ముందుకు వస్తానని చెప్పారు. తన మనసులో ఒకటి పెట్టుకుని బయట మరోటి మాట్లాడే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. గతంలో పార్టీలో లోపాలు ఉన్నప్పుడు వాటిని బహిరంగంగానే చెప్పానని, కార్యకర్తల సమస్యలు, పార్టీ అంశాలపై అంతర్గతంగాను, బహిరంగంగాను చర్చించానని గుర్తు చేశారు. అయితే ఇటీవల పీఏసీ సమావేశాల్లో అంతర్గత చర్చలు కూడా బయటకు వస్తున్నాయని భావించి, ఆ సమావేశాలకు హాజరుకావడం మానేశానని తెలిపారు. తాను హాజరై ఉంటే పార్టీ వ్యవహారాలను ఏఐసీసీ ఇన్‌చార్జి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేవాడినని, కానీ తన వ్యాఖ్యలు బయటకు వస్తాయనే కారణంతో దూరంగా ఉన్నానని వివరించారు. రాజకీయంగా తనకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉందని, దానికి సంబంధించిన వివరాలను నవంబర్‌లో వెల్లడిస్తానని జగ్గారెడ్డి చెప్పారు. రాబోయే మూడు నెలల్లో తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. కుటుంబం కంటే ప్రజలు, రాజకీయాలకే తాను అధిక ప్రాధాన్యత ఇస్తానని, రోజుకు 24 గంటలు ప్రజా సమస్యలు, రాజకీయాల గురించే ఆలోచిస్తానని తెలిపారు.

