📄 ePaper
Friday, July 31, 2026
📄 ePaper
HomeతెలంగాణGHMCషాపూర్ నగర్‌లో పేదల ఉపాధిపై బుల్డోజర్

షాపూర్ నగర్‌లో పేదల ఉపాధిపై బుల్డోజర్

కుత్బుల్లాపూర్, జూలై 29: (నవజ్యోతి ప్రతినిధి)షాపూర్ నగర్ రాజీవ్ పార్క్ సమీపంలో వీధి వ్యాపారాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నిరుపేద వ్యాపారుల దుకాణాలను ముందస్తు నోటీసులు జారీ చేయకుండా కూల్చివేయడంపై రాజకీయ వివాదం నెలకొంది. సీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సుమారు 12 దుకాణాలను తొలగించడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న బీఆర్ఎస్ నాయకుడు అన్వర్, డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ దృష్టికి విషయం తీసుకెళ్లగా, ఆయన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. దుకాణాల తొలగింపుతో ఉపాధి కోల్పోయిన కుటుంబాల పరిస్థితిని పరిశీలించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఈ విషయాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి బాధితులకు చట్టబద్ధంగా తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా పుప్పాల భాస్కర్ మాట్లాడుతూ, పేదల జీవనాధారమైన చిన్న దుకాణాలను ఎలాంటి ముందస్తు నోటీసులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా తొలగించడం మానవత్వానికి విరుద్ధమని విమర్శించారు. చట్టాన్ని అమలు చేసే క్రమంలోనూ పేదల జీవనోపాధి దెబ్బతినకుండా అధికారులు వ్యవహరించాలని కోరారు.

వీధి వ్యాపారుల హక్కులను పరిరక్షిస్తూ, బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచి అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అధికారులు కూడా ఈ వ్యవహారంపై సానుకూలంగా స్పందించి బాధితులకు ప్రత్యామ్నాయ పరిష్కారం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!