📄 ePaper
Friday, July 31, 2026
📄 ePaper
HomeతెలంగాణGHMCస్కూల్ పిల్లలకు మురుగే మార్గం..మల్లంపేటలో మౌలిక వసతుల వైఫల్యం

స్కూల్ పిల్లలకు మురుగే మార్గం..మల్లంపేటలో మౌలిక వసతుల వైఫల్యం

కుత్బుల్లాపూర్, జూలై 31: (నవజ్యోతి ప్రతినిధి) దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట గ్రామంలో మౌలిక సదుపాయాల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. రోడ్ నంబర్–1 నుంచి రోడ్ నంబర్–4 వరకు సుమారు 300 మీటర్ల మేర డ్రైనేజీ నీరు, వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రతిరోజూ స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు మురుగునీటిలోనే నడవాల్సిన దుస్థితి నెలకొంది. చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని, అంటువ్యాధులు వ్యాపించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలోని ఏపీఆర్ డ్రీమ్ వ్యాలీ నుంచి అమర్‌నాథ్ కిరాణా దుకాణం వరకు దాదాపు కిలోమీటర్ పొడవునా ఉన్న ప్రధాన డ్రైనేజీకి పరిసర ప్రాంతాలైన డ్రీమ్ వ్యాలీ, గ్రీన్ పార్క్‌తో పాటు మరో మూడు, నాలుగు కాలనీల నుంచి మురుగునీరు చేరుతోంది. దాదాపు పదివేల మంది జనాభా ఉపయోగిస్తున్న ఈ డ్రైనేజీకి ఏర్పాటు చేసిన పైపులు చాలా చిన్నవిగా ఉండటంతో ప్రతి వర్షానికీ నీరు రోడ్డుపైకి ఉప్పొంగుతోంది. కనీసం నాలుగు అడుగుల వెడల్పుతో కొత్త డ్రైనేజీ నిర్మిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

*నాసిరకం పనులతో ప్రజాధనం వృథా?*

గత ఐదేళ్లుగా ఇదే రోడ్డుకు పలుమార్లు మరమ్మతులు చేసినప్పటికీ సమస్య మాత్రం అలాగే కొనసాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నాణ్యతలేని రోడ్లు, బలహీనమైన డ్రైనేజీ మూతలు వేయడం వల్ల కొద్దిరోజుల్లోనే మళ్లీ దెబ్బతింటున్నాయని, ఫలితంగా ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయని విమర్శిస్తున్నారు.

*రోడ్లు మూసి గ్రామస్థులకే అడ్డుకట్ట?*

పీవీఆర్ మేడం కాలనీ గేటెడ్ కమ్యూనిటీ కానప్పటికీ, గ్రామ ప్రజలకు రాకపోకలు నిలిపివేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. కాలనీ అవసరాలకు మాత్రం మల్లంపేట గ్రామ ప్రజలనే ఆశ్రయిస్తున్నారని, కానీ అదే ప్రజలకు రహదారి వినియోగంపై ఆంక్షలు విధించడం అన్యాయమని మండిపడ్డారు. రోడ్డు మధ్యలో దేవాలయం నిర్మించి విగ్రహాలు ఏర్పాటు చేసినా, పరిసరాల్లోనే చెత్త, మురుగు పేరుకుపోతుండటం బాధాకరమని పేర్కొన్నారు.

*అధికారులు స్పందించకపోతే ధర్నా*

సమస్యను అధికారులు స్వయంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. ముఖ్యంగా స్కూల్ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే డ్రైనేజీ, రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో వారం రోజుల పాటు వేచి చూసి కూడా పరిష్కారం లేకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా చేపడతామని బీజేపీ సర్కిల్ ఉపాధ్యక్షుడు ఎంబరి ఆంజనేయులు గ్రామ ప్రజల తరఫున హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!