📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిరాజీవ్ పార్క్ అభివృద్ధిలో నలుగురు ముఖ్యమంత్రుల పాత్ర : జగ్గారెడ్డి

రాజీవ్ పార్క్ అభివృద్ధిలో నలుగురు ముఖ్యమంత్రుల పాత్ర : జగ్గారెడ్డి

సంగారెడ్డి, జూలై 30 (నవజ్యోతి ప్రతినిధి) :

సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్క్ అభివృద్ధి వెనుక నలుగురు ముఖ్యమంత్రుల సహకారం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. గురువారం రాజీవ్ పార్క్‌ను సందర్శించిన ఆయన అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పార్క్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యాయామ పరికరాలు, ఫౌంటెన్ పునరుద్ధరణ పనులు, ఇతర సౌకర్యాలను పరిశీలించిన జగ్గారెడ్డి, పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ పార్క్ ఏర్పాటుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారని గుర్తు చేశారు. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్య శంకుస్థాపన చేయగా, మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. అయితే గత పదేళ్లలో పార్క్ నిర్వహణ నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరిందని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి టీ.కే. శ్రీదేవి సహకారంతో మొదటి దశలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, రెండో దశలో మరో రూ.6 కోట్లతో మరిన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాజీవ్ పార్క్‌ను ఘనంగా పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జగ్గారెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, శ్రీహరి, కౌన్సిలర్లు మహేష్, నవాజ్‌తో పాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!