రైతులకు అండగా రూ.802.92 కోట్ల అత్యవసర కార్యాచరణ ప్రణాళిక…
హైదరాబాద్, జూలై 30 (నవజ్యోతి ప్రతినిధి):
రాష్ట్రంలో 30 శాతం వర్షాభావం వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోసం రాష్ట్ర నిపుణుల కమిటీ రూ.802.92 కోట్లతో సమగ్ర అత్యవసర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వ్యవసాయం, పశుసంవర్ధక, తాగునీటి రంగాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో రాష్ట్రానికి సాధారణంగా 740.60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, జూలై చివరి నాటికి కేవలం 234.80 మిల్లీమీటర్లు మాత్రమే కురిశాయి. 33 జిల్లాల్లో 26 జిల్లాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 79.49 లక్షల ఎకరాల్లో సాగు జరగగా, ఈసారి 74.56 లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. ముఖ్యంగా వరి సాగు సాధారణ విస్తీర్ణంలో 22.6 శాతం మాత్రమే నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
సాగు కాని సుమారు 32 లక్షల ఎకరాల్లో కందులు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పశుగ్రాస పంటల సాగును ప్రోత్సహించాలని కమిటీ సూచించింది. డ్రిప్, స్ప్రింక్లర్ నీటిపారుదల పరికరాలను 75 నుంచి 90 శాతం సబ్సిడీపై అందించేందుకు రూ.452.80 కోట్లు, ప్రత్యామ్నాయ పంటల విత్తనాల పంపిణీకి రూ.330 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించింది. అలాగే సోలార్ ఫెన్సింగ్, వర్మీ కంపోస్ట్ యూనిట్లు, కూరగాయల సాగు విస్తరణకు కూడా ప్రత్యేక నిధులు సూచించింది.
కరువు ప్రభావిత ప్రాంతాల్లో పంట రుణాల రీషెడ్యూల్, కొత్త రుణాల మంజూరు, పంటల బీమా ప్రీమియంలో 75 శాతం ప్రభుత్వమే భరించడం, గ్రామీణ ఉపాధి హామీ పనులను నిరంతరం కొనసాగించడం, పశుగ్రాస బ్యాంకుల ఏర్పాటు, పశువుల శిబిరాలు నిర్వహించడం, మిషన్ భగీరథ నీటిని తాగునీటికే ప్రాధాన్యంగా వినియోగించడం వంటి చర్యలను నివేదికలో ప్రతిపాదించింది.
అమలుపై పర్యవేక్షణ కోసం ప్రతి గ్రామంలో నోడల్ బృందాలను ఏర్పాటు చేసి పంటల పరిస్థితి, తాగునీటి నిల్వలు, విద్యుత్ సరఫరా, ప్రజారోగ్యాన్ని ప్రతిరోజూ సమీక్షించాలని సూచించింది. అలాగే కనీస మద్దతు ధర కంటే మార్కెట్ ధరలు తగ్గితే రైతులు నష్టపోకుండా టీఎస్ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో గ్రామాల సమీపంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

