సంగారెడ్డిలో కాంగ్రెస్ బీఎల్‌ఏల సమీక్ష సమావేశం – సర్ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపు
సంగారెడ్డి, జూలై 29 (నవజ్యోతి ప్రతినిధి):
ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని, అది ఎవరిదైనా సరే ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా నమోదు చేయించాల్సిన బాధ్యత ప్రతి బీఎల్‌ఏపై ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ బీఎల్‌ఏల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. “మన శత్రువు అయినా సరే ఓటు మిస్ అవుతుంటే నమోదు చేయించాల్సిందే” అని పేర్కొన్న జగ్గారెడ్డి, ఓటు హక్కు కోల్పోతే ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను కూడా కోల్పోయే అవకాశం ఉంటుందని అన్నారు. రాజకీయాల కోసం కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే సర్ (SIR) ప్రక్రియకు సహకరించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. గత నెల రోజులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సర్ ప్రక్రియలో చురుకుగా పనిచేస్తున్నారని, ఇప్పటికే నిర్వహించిన ఐదు సమావేశాలకు ప్రతి బీఎల్‌ఏ హాజరై బాధ్యతాయుతంగా వ్యవహరించారని అభినందించారు. ఆగస్టు 2న మరో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సర్ ప్రక్రియపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ఒక్క అర్హుడి ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బోనాల పండుగ సందర్భంగా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఇంటికీ వెళ్లి ఓటరు వివరాలు పరిశీలించాలని బీఎల్‌ఏలకు సూచించారు. ఎన్నికల సంఘం పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, అప్రమత్తంగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనితా సంతోష్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

