మెదక్ జిల్లాలో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ప్రత్యేక కార్యక్రమాలు
గురువుల ఆశీస్సులతో సమాజంలో ధార్మిక చైతన్యం పెంపొందించాలని పిలుపు
ఆధ్యాత్మిక, సనాతన ధర్మ ప్రచారకులను సత్కరించిన బీజేపీ నాయకులు
మెదక్, జూలై 29 (నవజ్యోతి ప్రతినిధి):
గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ధార్మిక (ఎండోమెంట్) సెల్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో ఆధ్యాత్మిక గురువులను ఘనంగా సన్మానించారు. బీజేపీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు ఆదేశాలు, తెలంగాణ బీజేపీ ఎండోమెంట్ (ధార్మిక) సెల్ కన్వీనర్, కో-కన్వీనర్ల సూచనల మేరకు జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక చైతన్యం, సమాజంలో నైతిక విలువల పెంపు కోసం విశేష సేవలు అందిస్తున్న పలువురు గురువులను శాలువాతో సత్కరించి సన్మానించారు. గురువుల సేవలు సమాజ నిర్మాణానికి ఎంతో విలువైనవని, వారి ఆశీస్సులు సమాజ శ్రేయస్సుకు దోహదపడతాయని నాయకులు పేర్కొన్నారు.సన్మానం పొందిన వారిలో రంగంపేట పీఠాధిపతి శ్రీ మదవానంద స్వామీజీ, చాకరిమెట్లకు చెందిన శ్రీ ఆంజనేయ శర్మ, ప్రసన్న ఆంజనేయ ఆలయానికి చెందిన శ్రీ చెలిమేటి సంజీవులు, శివాలయ గురుస్వామి శ్రీ వీరప్ప, గురుదత్త ఆలయానికి చెందిన శ్రీ వామని పంతులు, బహుళముఖి శక్తి పీఠానికి చెందిన శ్రీ వెంకటేశ్వర శర్మ ఉన్నారు.గురు పౌర్ణమి సందర్భంగా గురువుల త్యాగం, సేవాభావం, ధర్మబోధనలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, యువతలో భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలపై అవగాహన పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశం గౌడ్, నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్ నిరంజన్, రమేష్ గౌడ్ హాజరై పూర్తి సహకారం అందించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా ఎండోమెంట్ కమిటీ సభ్యులను నాయకులు అభినందించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్ కవితా రెడ్డి, జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్ తాళ్ల విజయ్, జిల్లా కో-కన్వీనర్ ప్రసాద్ రెడ్డి, జిల్లా జాయింట్ కన్వీనర్లు నవీన్, కృష్ణ, వీరారెడ్డితో పాటు బీజేపీ నాయకులు, ధార్మిక సెల్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

