బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు ఐక్యంగా పోరాడాలి: గొరగంటి రమేష్ కుమార్
ఆగస్టు 7న బెంగళూరులో జరిగే అఖిల భారత బీసీ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు
సంగారెడ్డి, జూలై 29 (నవజ్యోతి ప్రతినిధి):
బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు బీసీ సమాజమంతా ఐక్యంగా ఉద్యమించాలని సంగారెడ్డి జిల్లా బీసీ సంఘం యువత అధ్యక్షుడు గొరగంటి రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆగస్టు 7న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో నిర్వహించనున్న అఖిల భారత బీసీ మహాసభల ప్రచార కార్యక్రమంలో భాగంగా సంబంధిత గోడపత్రికను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అందోల్ మాజీ ఎమ్మెల్యే కాంతికిరణ్‌లను మర్యాదపూర్వకంగా కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గొరగంటి రమేష్ కుమార్ మాట్లాడుతూ, బీసీల రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం సాధించేందుకు బీసీ సమాజం ఏకతాటిపైకి రావాలని, 42 శాతం రిజర్వేషన్ల అమలే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, ఆగస్టు 7న బెంగళూరులో జరిగే అఖిల భారత బీసీ మహాసభలో తాము తప్పకుండా పాల్గొంటామని తెలిపారు. బీసీల న్యాయమైన డిమాండ్ల సాధనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి విద్యార్థి సంఘం అధ్యక్షుడు జగదీష్, సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడు లాడే బాలు, టీజీవీపీ నాయకుడు యాదగిరి, జయపాల్, విజయేంద్ర, శబ్బీర్ బాబు, శ్రీనివాస్‌తో పాటు సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

