కుత్బుల్లాపూర్, జూలై 29: (నవజ్యోతి ప్రతినిధి)దుండిగల్ సర్కిల్ పరిధిలో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న రెండు ప్రమాదకర ప్రాంతాలు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. నెలల తరబడి సమస్యలు అలాగే ఉండిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
*రోడ్డు మధ్యలో భారీ గుంత…ప్రమాదాలకు కారణం*
నర్సాపూర్ ప్రధాన రహదారి కాజిపల్లి చౌరస్తా లో రహదారి మధ్యలో ఏర్పడిన భారీ గుంత గత కొన్ని నెలలుగా అలాగే ఉంది. ఈ గుంతను మరమ్మతు చేయడంలో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ గుంత కనిపించక పలువురు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారని, చిన్నా–పెద్ద గాయాలైన సంఘటనలు ఇప్పటికే అనేకసార్లు చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు. మరింత పెద్ద ప్రమాదం జరిగేలోపు దుండిగల్ సర్కిల్ ఇంజనీరింగ్ అధికారులు వెంటనే స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
*డ్రైనేజీ మ్యాన్‌హోల్ మూత ధ్వంసం…నోరు తెరిచి ఉన్న ప్రమాదం*
అదే దుండిగల్ సర్కిల్ పరిధిలోని చర్చ్ గాగిల్లాపూర్ గ్రామం, సర్వే నంబర్ 214లో గోల్డెన్ స్టార్ స్కూల్ సమీపంలో డ్రైనేజీ మ్యాన్‌హోల్ మూత పూర్తిగా ధ్వంసమై తెరిచి ఉండడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మ్యాన్‌హోల్‌లో వర్షపు నీరు నిలిచి ప్రమాదం మరింత పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల సమీపంలో ఉండటంతో విద్యార్థుల భద్రతపై కూడా ఆందోళన నెలకొంది. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు గుంతను పూడ్చడంతో పాటు డ్రైనేజీ మ్యాన్‌హోల్‌కు కొత్త మూత అమర్చాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

