📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
HomeతెలంగాణGHMC"ఇంకుడు గుంత లేకుంటే... రేపటి తరానికి నీటి గుంతే!"

“ఇంకుడు గుంత లేకుంటే… రేపటి తరానికి నీటి గుంతే!”

కుత్బుల్లాపూర్, జూలై 26:( నవ జ్యోతి ప్రతినిధి):

 

వర్షపు నీటి సంరక్షణపై ప్రభుత్వం ఇక ఆలస్యం చేయరాదని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతను తప్పనిసరి చేసేలా చట్టాలు తీసుకురావాలని పర్యావరణ సామాజికవేత్త కోల రవీందర్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని కోరారు. భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్న తరుణంలో ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో వేల అడుగుల బోర్లు వేసినా నీటి చుక్క దొరకని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

తాను 25 సంవత్సరాల క్రితం ఇంట్లో 14 అడుగుల లోతుతో ఇంకుడు గుంత నిర్మించి, ప్రతి సంవత్సరం దానిని శుభ్రపరుస్తూ వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు. అదే ఫలితంగా 15 ఏళ్ల క్రితం వేసిన 300 అడుగుల బోరు ఇప్పటికీ నీరు ఇస్తోందని చెప్పారు.

నగరంలో సిమెంట్ రోడ్లు, భారీ అపార్ట్‌మెంట్లు పెరగడంతో వర్షపు నీరు భూమిలోకి వెళ్లే మార్గాలు మూసుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా బోర్లు వేయాలంటే తప్పనిసరిగా ఇంకుడు గుంత లేదా రీచార్జ్ బోర్ ఉండాలని, లేకపోతే అనుమతులు నిరాకరించాలని సూచించారు. ఇంకుడు గుంతలు లేకుండా బోర్లు వేస్తే మోటార్లు సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధించాలని డిమాండ్ చేశారు.

గతంలో జీహెచ్‌ఎంసీ నిర్మించిన వందలాది ఇంకుడు గుంతలు ప్రస్తుతం చెత్తతో మూసుకుపోయాయని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. అలాగే హెచ్‌ఎండీఏ భవన అనుమతులు, ప్రభుత్వ సబ్సిడీలు, పరిశ్రమల అనుమతుల్లో కూడా వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థను తప్పనిసరి చేస్తేనే భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించగలమని కోల రవీందర్ ముదిరాజ్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!